Kalvakuntla Kavitha: బీఆర్‌ఎస్ మాజీ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. దీంతో ఆమె అధికారికంగా తెలంగాణ శాసనమండలి సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మంగళవారం మండలి కార్యదర్శి వి. నర్సింహాచార్యులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కవిత 2021 డిసెంబరులో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై, 2022 జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే గత ఏడాది నుంచి పార్టీ నాయకత్వంతో ఆమెకు విభేదాలు బయటపడుతూ వచ్చాయి. ముఖ్యంగా 2024 ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ అనంతరం, పార్టీ అధినేత కేసీఆర్‌కు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆమె రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
అదే సమయంలో పార్టీలోని కీలక నేతలు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా పెద్ద వివాదంగా మారాయి. క్రమశిక్షణారాహిత్యాన్ని కారణంగా చూపుతూ గత సెప్టెంబరులో బీఆర్‌ఎస్ ఆమెను సస్పెండ్ చేసింది. అదే రోజు కవిత తన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
అయితే ఎమ్మెల్సీ పదవికి ఇచ్చిన రాజీనామాపై పునరాలోచించాలని ఛైర్మన్ అప్పట్లో కవితకు సూచించారు. ఇటీవల ఆమె స్వయంగా శాసనమండలికి హాజరై ప్రసంగించి, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఛైర్మన్ తుది నిర్ణయం తీసుకుని, ఆమె రాజీనామాకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
కవిత పదవీకాలానికి ఇంకా రెండేళ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేయడంతో, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ జాగృతి పునరుత్తేజం – భవిష్యత్తు ప్రణాళిక
రాజకీయంగా స్వతంత్ర మార్గాన్ని ఎంచుకున్న కవిత, ప్రస్తుతం తన పూర్తి దృష్టిని తెలంగాణ జాగృతి సంస్థపై కేంద్రీకరించారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ఆమె ప్రకటించారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా మంగళవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో భారీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సంస్థ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయడానికి ఒక స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. ఎల్. రూప్‌సింగ్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించగా, జర్నలిస్టులు సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర, అలాగే సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.
రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని వివిధ రంగాలపై లోతైన అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. బడ్జెట్, సాగునీరు, మహిళా సాధికారత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం వంటి అంశాలపై ఈ కమిటీలు విశ్లేషణ చేపట్టనున్నాయి. వీటి నివేదికల ఆధారంగా జనవరి 17న తెలంగాణ జాగృతి తన తదుపరి పోరాట దిశను ప్రకటించనుంది.
ఎమ్మెల్సీ పదవిని కోల్పోయినప్పటికీ, సామాజిక ఉద్యమాల ద్వారా ప్రజల మధ్యనే కొనసాగాలనే నిర్ణయంతో కవిత ముందుకు సాగుతున్నారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
