Jublee hills By-poll: చివరి రోజు ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసుకుంది. ముఖ్యంగా మోతీనగర్, యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో ప్రజల ఆకర్షణకు అనుగుణంగా కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఉదయం మోతీనగర్‌లో మంత్రి హరీష్‌రావు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొని స్థానిక నేతలు, కార్యకర్తలతో ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమస్యలు, ఓటర్లతో ఎలా మమేకం కావాలో చర్చించే అవకాశం ఉంది.
సాయంత్రం బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ర్యాలీల్లో కేటీఆర్, మాగంటి సునీత వంటి ప్రముఖ నాయకులు పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరనున్నారు. షేక్‌పేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్ మీదుగా వెంగళరావు నగర్, సోమాజిగూడ వరకు సాగుతుంది. చివరగా బోరబండలో ప్రజాసభతో ర్యాలీ ముగియనుంది.
ఈ కార్యక్రమాల ద్వారా బీఆర్ఎస్, చివరి రోజున ప్రచార వేడి మరింత పెంచి, ప్రజల్లో ఉత్సాహం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక కార్యకర్తలు కూడా ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా గులాబీ పార్టీ ప్రచారం కలకలం రేపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరి దశలో ప్రచార ప్రభావం ఓటర్లపై ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా కదులుతున్నాయి.
