Hyderabad: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన మూడు నెలల్లోనే భార్యపై అనుమానాలు పెంచుకున్న భర్త ఆమెను మానసికంగా వేధించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను మాధ్యమంగా మార్చాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీం రాజ్ అనే వ్యక్తి ఓ యువతితో మూడు నెలల క్రితం ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నాడు. కానీ వివాహానంతరం మద్యం అలవాటు చేసుకున్న భీం రాజ్, భార్యను తరచూ వేధించసాగాడు.
తాజాగా, ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు, పదాలతో కూడిన పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆమెను తీవ్రంగా హింసించాడు. దీనివల్ల తీవ్ర మనస్తాపానికి గురైన భార్య పుట్టింటికి వెళ్లి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భర్త భీం రాజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.
