Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఈ కొత్త విధానం అమలు కానుంది. ఇంటర్ విద్యా మండలి తాజాగా ఈ మార్పులపై పూర్తి వివరాలను అన్ని కాలేజీలకు పంపింది.
ఇప్పటివరకు గణితం రెండు పేపర్లుగా — 1A, 1B — ఉండేది. కానీ ఇక నుంచి గణితం ఒక్కటే సబ్జెక్ట్‌గా 100 మార్కుల పేపర్‌గా నిర్వహించబడుతుంది. పాస్ అవ్వాలంటే కనీసం 35 మార్కులు సాధించాలి. ఇదే విధంగా బైపీసీ విద్యార్థుల కోసం బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘బయాలజీ’గా మార్చారు. ఈ పేపర్ మొత్తం 85 మార్కులకు జరుగుతుంది. ఫస్ట్ ఇయర్‌లో కనీసం 29 మార్కులు, సెకండ్ ఇయర్‌లో 30 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోనూ ఇదే విధంగా 85 మార్కుల పరీక్షలు ఉంటాయి. పాస్ మార్కులు కూడా అదే విధంగా నిర్ణయించారు. గతంలో ఈ సబ్జెక్టులు 60 మార్కుల చొప్పున ఉండేవి, పాస్ మార్కులు 21గా ఉండేవి. అయితే ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు లేదా గతంలో ఫెయిల్ అయి తిరిగి పరీక్షలు రాసే వారికి మాత్రం పాత విధానం వర్తిస్తుంది.
అలాగే ఈ సంవత్సరం నుంచి కొత్తగా “ఎలక్టివ్ సబ్జెక్ట్” విధానం ప్రవేశపెట్టారు. ఏ గ్రూప్ విద్యార్థులైనా మొత్తం 24 సబ్జెక్టులలో తాము ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకోవచ్చు. సైన్స్ సబ్జెక్టులు 85 మార్కులకు, ఆర్ట్స్ సబ్జెక్టులు 100 మార్కులకు ఉంటాయి. మొత్తంగా రెండేళ్లలో వెయ్యి మార్కులకు పరీక్షలు జరుగుతాయి.
ఇంకా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అదనంగా ఒక సబ్జెక్టు తీసుకునే అవకాశం కూడా కల్పించారు. ఉదాహరణకు ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు. అయితే ఈ అదనపు సబ్జెక్ట్ మార్కులు మొత్తం మార్కులలో కలపరు. కొత్త ఎలక్టివ్ విధానం వల్ల పరీక్షల షెడ్యూలు కొంత పెరిగినట్లు మండలి తెలిపింది.
