Rain Alert: అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ

heavy rains in Telugu States

heavy rains in Telugu States

Rain Alert: సోమవారం, మంగళవారం కురిసిన భారీ వర్షాల తర్వాత, బుధవారం వినాయక చవితి రోజున వర్షాలు కాస్త తగ్గాయి. అయితే వాతావరణ శాఖ మరోసారి వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. గురువారం (28-08-25) నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ – ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.

అలాగే తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వినాయక మండపాల నిర్వాహకులు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం నాడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

సాయంత్రం 5 గంటల వరకు వివిధ చోట్ల అధిక వర్షపాతం నమోదైంది. మన్యం జిల్లా సీతంపేటలో 77 మిమీ, కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5 మిమీ, భీమవరం 67.5 మిమీ, విజయవాడ పశ్చిమలో 62.5 మిమీ, విజయవాడ సెంట్రల్‌లో 62 మిమీ వర్షపాతం నమోదైనట్టు ప్రఖర్ జైన్ తెలిపారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నందున కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, వంకలు, కాలువలు, నదులను దాటే ప్రయత్నం చేయకూడదని, స్నానాలు చేయరాదని హెచ్చరించారు.

వినాయక నిమజ్జనాల సమయంలో నదులు, కాలువల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించి, అధికారులకు సహకరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

Also Read: Vastu Tips: ఈ పక్షులు ఇంట్లోకి వస్తే కుటుంబంలో ఎప్పుడూ గొడవలేనట..!

Rain Alert: అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ