Heavy Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా, తరువాత తుఫాన్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రానికి అత్యంత కీలకం.
ఈ ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ప్రత్యేకంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు చేరే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం వద్ద బలమైన ఈదురుగాలులు, ఎత్తైన అలలు ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
వాతావరణశాఖ ప్రకారం, తుఫాన్‌కు ‘మొంథా (Montha)’ అని పేరు పెట్టారు. ఈ పేరును థాయ్‌లాండ్ సూచించింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరాలు ఇలా ఉన్నాయి:
-
రేపటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుంది
-
సోమవారం నాటికి ఇది తుఫాన్‌గా మారే అవకాశం
-
శనివారం – భారీ వర్షాలు
-
ఆదివారం – అతి భారీ వర్షాలు
-
సోమవారం, మంగళవారం – అత్యంత భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం
ఈ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు, చెట్లు, విద్యుత్ సరఫరా స్తంభాలు కూలే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సలహా ఇచ్చారు.
హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఎండీ ప్రఖర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ఏ జిల్లాలోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి స్పష్టం చేశారు.
అదే విధంగా తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
