Heavy Rains: రాష్ట్రంపై వాయుగుండం ముప్పు పెరుగుతోంది. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అందువల్ల కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ, బుధవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని కూడా తెలిపింది. కొన్ని వాతావరణ మోడళ్ల ప్రకారం, ఇది తుపానుగా కూడా మారవచ్చని సూచనలున్నాయి.
ఇదే సమయంలో, దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ మోడళ్లు సూచిస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో ఉన్న తీవ్ర అల్పపీడనం కూడా పశ్చిమ దిశగా కదులుతూ, బుధవారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం రోజున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది.
దక్షిణ కోస్తా తీరం వెంట గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని ప్రభావిత జిల్లాల యంత్రాంగాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 112, 1070, 1800-425-0101 నంబర్లకు సంప్రదించాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Life Style: చికెన్ తినడం వల్ల ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారా?
Heavy Rains: వాయుగుండం ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
