Tragedy: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువకుడిని తోకల హృతిక్ రెడ్డిగా గుర్తించారు. 25 ఏళ్ల హృతిక్ రెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ యూరప్ ఫర్ అప్లైడ్ సైన్సెస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు.
మీడియా కథనాల ప్రకారం, బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల సమయంలో అతడు నివసిస్తున్న భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు, దట్టమైన పొగలో చిక్కుకున్న హృతిక్ రెడ్డి ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం పై అంతస్తు నుంచి దూకాడు. ఈ క్రమంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
హృతిక్ రెడ్డి తెలంగాణలోని జనగామ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందినవాడు. హనుమకొండ జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన అతడు, జూన్ 2023లో ఎంఎస్ చదువుల కోసం జర్మనీలోని మాగ్డెబర్గ్‌కు వెళ్లాడు.

ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దసరా పండుగకు భారత్‌కు రావాల్సిన హృతిక్ రెడ్డి, ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని జనవరి రెండో వారంలో సంక్రాంతికి రావాలని ప్లాన్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని పార్థివ దేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కుటుంబం ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)ను సంప్రదించింది.
ఇదిలా ఉండగా, అగ్నిప్రమాదానికి గల కారణాలపై జర్మన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇక ఇదే తరహాలో, ఈ ఘటనకు నెల రోజుల ముందు అమెరికాలో కూడా తెలంగాణకు చెందిన మరో విద్యార్థిని అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లాకు చెందిన సహజ రెడ్డి ఉడుముల అనే 24 ఏళ్ల విద్యార్థిని, ఉన్నత చదువుల కోసం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం అల్బనీలో నివసిస్తోంది.
డిసెంబర్ 4న ఆమె నిద్రలో ఉండగా నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమె శరీరంలో దాదాపు 90 శాతం కాలిన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
