Ganesh Laddu: గణపతి నవరాత్రులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అద్భుతంగా, ఘనంగా జరుగుతాయి. కానీ ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఘట్టాలు కనిపిస్తాయి. అందులో ఒకటి బడా గణేష్ మహారాజ్ మరొకటి బాలాపూర్ గణపతి లడ్డూ వేలం. ఈ రెండు సంఘటనలతోనే హైదరాబాద్ వినాయక ఉత్సవాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
ప్రతి ఏడాది బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూ వేలంలో కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. గత ఏడాది ఆ లడ్డూ ఏకంగా 35 లక్షలు పలికింది. ఈసారి మాత్రం నగర శివార్లలోని రిచ్‌మండ్ విల్లా సభ్యులు దాన్ని అద్భుతమైన ధరకు కొన్నారు. ఏకంగా రూ. 2.32 కోట్లకు ఆ లడ్డూ దక్కించుకోవడం ఉత్సవాలకు మరింత ప్రత్యేకతను తెచ్చింది.
ఇంతటి క్రేజ్ ఉన్న లడ్డూను ఈసారి ఒక డిగ్రీ విద్యార్థి కేవలం 99 రూపాయలకే గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ 51.77 లక్షలు పలికిన వేళ, కొత్తపేటలో జరిగిన సంఘటన మాత్రం భిన్నంగా నిలిచింది. శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ నిర్వహించిన లక్కీ డ్రాలో 760 టోకెన్లు అమ్మగా, బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ విజేతగా నిలిచాడు. అతనికి 333 కిలోల భారీ లడ్డూ దక్కింది.
ఒక వైపు కోట్లు, లక్షల రూపాయలకు లడ్డూ వేలం వేయబడుతుండగా, మరో వైపు కేవలం రూ.99కే అంత పెద్ద లడ్డూ గెలవడం సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన గణేశ్ నవరాత్రుల ఉత్సాహాన్ని మరింత పెంచేసింది.
