High Court: ప్రస్తుత కాలంలో వైవాహిక బంధాలు మరింత బలహీనంగా మారుతున్నాయి. చిన్నచిన్న అభిప్రాయభేదాలు, మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, భార్య వంట చేయడం లేదని, తన తల్లితో ఇంటి పనులు పంచుకోవడం లేదని పేర్కొంటూ ఓ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.
విడాకులు మంజూరు చేయాలంటూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన హైకోర్టు, భార్య ప్రవర్తనను మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం, వివాహాన్ని రద్దు చేయనని కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీల్‌ను తిరస్కరించింది.
ఈ దంపతులు మే 2015లో వివాహం చేసుకున్నారు. గృహ విభేదాలు, 2017లో జరిగిన గర్భస్రావం వంటి వైద్యపరమైన కారణాలతో 2018 అక్టోబర్ నుంచి విడివిడిగా నివసిస్తున్నారు. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు, వైవాహిక జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న అసహనాలు, సాధారణ ఒడిదుడుకులు విడాకులకు సరైన కారణాలు కాదని మరోసారి పునరుద్ఘాటించింది.
భర్త చేసిన ఆరోపణలను పరిశీలించిన ధర్మాసనం, అతడు సికింద్రాబాద్‌కు చెందిన న్యాయ పట్టభద్రుడని, భార్య ఎల్‌బీ నగర్‌కు చెందిన టెక్నాలజీ ప్రొఫెషనల్ అని గుర్తించింది. భర్త మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసి, రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుతాడని, భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తూ, ఉదయం 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరుతుందని కోర్టు గమనించింది.
ఇలాంటి పరిస్థితుల్లో భార్య భర్తకు ప్రతిరోజూ వంట చేయలేకపోవడం లేదా అత్తగారికి పూర్తిగా ఇంటి పనుల్లో సహాయం చేయలేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది మానసిక క్రూరత్వం కిందకు రాదని స్పష్టం చేశారు. అంతేకాదు, విచారణ సమయంలో భర్తే గతంలో తన భార్య వంటగదిలో తల్లికి సహాయం చేసిందని, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించిందని అంగీకరించిన విషయాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.
కోడలు ఇంటి పనుల్లో సహకరించడం లేదన్న అత్తగారి అసంతృప్తి మానసిక క్రూరత్వం స్థాయికి చేరదని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అలాగే ఐపీసీ సెక్షన్ 498-ఏ కింద భార్య ఫిర్యాదు చేయలేదని, ఆమె తండ్రి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటూ, భర్తను వేధించిందని అనుకోవడానికి ఆధారాలు లేవని తెలిపింది. గర్భస్రావం అనంతరం వైద్యపరంగా కోలుకునేందుకు భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం సహజమని కోర్టు అభిప్రాయపడింది.
వైవాహిక జీవితంలో అభిప్రాయభేదాలు, చిన్నపాటి గొడవలు సాధారణమేనని, అవి నిరంతర మానసిక క్రూరత్వంగా భావించలేమని ధర్మాసనం తేల్చింది. కుటుంబ కోర్టు తీర్పులో ఎలాంటి చట్టపరమైన లోపం లేదని పేర్కొంటూ, భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది.
