Bus Tragedy: శుక్రవారం ఉదయం కర్నూలు సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన విధానం, కారణాలపై అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు పరిశీలనలు చేస్తున్నాయి. మొదటి దశలో లభించిన వివరాల ప్రకారం, బస్సు డోర్ వద్ద ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ దెబ్బతినడంతో డోర్లు తెరుచుకోలేదు, దీంతో ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకపోయింది.
అదే సమయంలో బస్సు లగేజీ క్యాబిన్‌లో 400కి పైగా మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వేడికి మొబైల్ బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోవడం వల్ల మంటలు మరింత వేగంగా వ్యాపించి ప్రమాద తీవ్రత పెరిగిందని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. ప్రైవేట్ బస్సుల్లో ఇలాంటి పార్సిల్ సరుకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ, ఈ బస్సులో ఆ నిబంధనలు పట్టించుకోలేదని అధికారులు తెలిపారు.
ప్రమాదం మొదట ఒక బైక్ ఢీ కొనడంతో ప్రారంభమైంది. ఢీకొట్టిన ప్రభావంతో బస్సులో స్పార్క్‌లు రావడంతో అగ్ని చెలరేగింది. అంతేకాక డీజిల్ ట్యాంక్ లీక్ కావడం వల్ల మంటలు క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో, ఎమర్జెన్సీ డోర్ కూడా సరిగ్గా తెరుచుకోకపోవడం ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.
ఈ బస్సుపై ఇప్పటికే పది కంటే ఎక్కువ చలాన్లు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు సూచిస్తున్నాయి. డ్రైవర్ ప్రమాద సమయంలో బస్సును ఆపి బయటకు దిగిపోయినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో చాలామందికి స్పందించే అవకాశం లేకపోయింది.
ప్రమాద ప్రదేశంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉందని అధికారులు తెలిపారు. కొన్ని శరీరాలను గుర్తించడం కూడా క్లిష్టంగా ఉంది. ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది.
అధికారుల హెచ్చరిక:
-
ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం
-
లగేజీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదానికి దారి తీసే సరుకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లరాదు
-
ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను సకాలంలో తనిఖీ చేసి పనిచేసేలా ఉంచడం తప్పనిసరి
ఈ ఘటనపై ప్రభుత్వం అధికస్థాయి విచారణకు ఆదేశించింది.
