Cyber Crime: మోసపోయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య

Ex-IPS officer's wife duped of Rs 2.58 crore in online scam in Hyderabad

Ex-IPS officer's wife duped of Rs 2.58 crore in online scam in Hyderabad

Cyber Crime: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. స్టాక్ మార్కెట్‌లో త్వరగా లాభాలు వస్తాయని నమ్మించి, ఆమె నుంచి మొత్తం రూ.2.58 కోట్లను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

2025 నవంబర్ చివరి వారంలో ఊర్మిళ వాట్సాప్‌కు గుర్తు తెలియని నంబర్ నుండి ఓ సందేశం వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా చాలా తక్కువ సమయంలో భారీ లాభాలు పొందవచ్చని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ విషయం నమ్మిన ఆమె, ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో నేరగాళ్లు సూచించిన ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సేంజ్ 20’ అనే వాట్సాప్ గ్రూప్‌లో తన భర్త వీవీ లక్ష్మీనారాయణ నంబర్‌ను యాడ్ చేయించారు.

గ్రూప్‌లో చేరిన కొద్దిసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో చాట్ మొదలుపెట్టాడు. తనను ఐఐటీ ముంబై గ్రాడ్యుయేట్‌గా, అమెరికాలో పీహెచ్‌డి చేశానని చెప్పాడు. అదేవిధంగా, తాను రాసిన ‘స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్’ అనే పుస్తకం త్వరలో విడుదల కానుందని చెప్పి నమ్మకాన్ని పెంచాడు. వాట్సాప్ గ్రూప్‌లోని ఇతర సభ్యులకు ట్రేడింగ్‌పై శిక్షణ ఇస్తూనే ఆయన కొన్ని స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టమని సూచించేవాడు. ఆ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టినవారికి వచ్చిన లాభాల స్క్రీన్ షాట్లు కూడా పంచేవాడు. 500 శాతం వరకు లాభాలు వస్తాయని చెప్పి గ్రూప్ సభ్యులను ప్రోత్సహించాడు.

మరోవైపు, దినేష్ సింగ్ శిష్యురాలినంటూ ప్రియసఖి అనే మహిళ కూడా గ్రూప్‌లో ఉండి ఆయన సూచనలను బలపరిచేలా పోస్టులు చేసేది. సామూహిక పెట్టుబడులు పెడితే ఐదు నుంచి ఆరు వారాల్లో భారీ లాభాలు పొందవచ్చని చెప్పి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సెబీ అనుమతి పొందిన ‘మొకిన్లీ’ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు పొందుతున్నామని నమ్మించేలా నకిలీ పత్రాలు కూడా పంపించారు.

దీనితో మోసగాళ్లను నమ్మిన ఊర్మిళ యాపిల్ యాప్ స్టోర్ నుంచి ‘MCKEIY CMA’ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో ట్రేడింగ్ ఖాతా తెరిచారు. అనంతరం 2025 డిసెంబర్ 24 నుంచి 2026 జనవరి 5 వరకు 19 విడతల్లో మొత్తం రూ.2.58 కోట్లను ఆ ఖాతాకు బదిలీ చేశారు. ఈ డబ్బును ఆమె మాత్రమే కాకుండా తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న రుణం ద్వారానూ చెల్లించారు.

కానీ తర్వాత ట్రేడింగ్ ఖాతాలో లాభాల వివరాలు కనబడుతున్నా, విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడంతో అనుమానం వచ్చి అడిగింది. మరింత డబ్బు పెట్టకపోతే పెట్టిన మొత్తం మొత్తం పోతుందని బెదిరించడంతో మోసమైందని అర్థం చేసుకుంది. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు మోసగాళ్లు డబ్బును పంపిన మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Juice: సొరకాయ జ్యూస్ తాగుతున్నారా?

Cyber Crime: మోసపోయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య