Diarrhea: విజయవాడలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా న్యూరాజరాజేశ్వరిపేట ప్రాంతంలో పలువురు ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. చవితి సందర్భంగా వడ్డించిన భోజనాల వలన ఫుడ్‌పాయిజనింగ్ జరిగిందని అధికారులు భావిస్తుండగా, మరోవైపు స్థానికులు మాత్రం మంచినీరు కలుషితమైందని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి నీటి శాంపిల్స్ సేకరించారు. అలాగే ఇంటింటి సర్వే నిర్వహించి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. డయేరియా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వైద్య బృందాలను పంపారు.
అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించడానికి మంత్రి నారాయణ మరియు ఎమ్మెల్యే బోండా ఉమ సంఘటనా స్థలికి వెళ్లారు. బాధితులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అంతేకాక, అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి నారాయణ నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కూడా బాధితులను స్వయంగా పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 22 మందిని డిశ్చార్జ్ చేశామని, ఇంకా 41 మందికి వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ (ఫోన్: 91549 70454) ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
ప్రభావిత ప్రాంతమైన RR పేటలో 24 గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. డయేరియా వ్యాప్తిని అదుపులోకి తెచ్చే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు.
