Cyber Crime: దీపావళి ఆఫర్లు అంటేనే అందరి మనసుల్లో ఆశలు చిగురిస్తాయి. గిఫ్ట్స్, బోనస్‌లు, రివార్డ్ పాయింట్స్ అని చూస్తే వెంటనే “వావ్!” అనిపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం ఆ ఉత్సాహం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, దీపావళి సీజన్‌ను కూడా సైబర్ నేరగాళ్లు తమ లక్ష్యంగా మార్చుకున్నారు. ఇప్పటికే కేవలం రెండు రోజుల్లోనే 400 మందిని మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఏ సందర్భమైనా, ఈ సైబర్ దొంగలు వెనకాడరు. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించినా, కంపెనీలు ఆఫర్లు ఇచ్చినా, పండుగలు వచ్చినా లేదా విపత్తులు సంభవించినా – వీళ్లు వెంటనే కొత్త మోసాల కోసం దారులు వెతుకుతారు. టెక్నాలజీతోపాటు తామూ అప్డేట్ అవుతూ ప్రజల డబ్బును దోచుకుంటున్నారు.
ఇప్పుడు దీపావళి పేరుతో కొత్తగా నకిలీ వెబ్‌సైట్లు తెరపైకి వచ్చాయి. “తక్కువ ధరలో క్రాకర్స్”, “హోల్‌సేల్ రేట్లకు టపాసులు”, “కేజీ సేల్స్ ఆఫర్” అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫిషింగ్ లింకులు, ఏపీకే ఫైల్స్ పంపుతూ ట్రాప్ చేస్తున్నారు. “దివాళి గిఫ్ట్ ఆఫర్”, “బ్యాంక్ రివార్డ్ పాయింట్స్” అనే పేర్లతో లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారు.
అట్రాక్ట్ అయి ఒకసారి క్లిక్ చేస్తే చాలు – అకౌంట్ ఖాళీ అవ్వడానికి క్షణాల వ్యవధి చాలు. బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్లు దొంగిలించి మొత్తం డబ్బు లాగేస్తున్నారు. ఇప్పటికే బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీపావళి పేరుతో వచ్చే లింకులు, సందేహాస్పద ఫైల్స్ లేదా వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
