High Court: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను నవంబర్ 24లోపు కోర్టుకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వివరణల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ, మంచిర్యాల జిల్లా వ్యక్తి అయిన రెంక సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలను ఇక ఆలస్యం చేయకుండా తక్షణం నిర్వహించేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
ఈ పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2024 జనవరిలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినా, సంవత్సరం దాటినా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్. వెంకటయ్య మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ స్పష్టమైన కారణాలు చెప్పకుండా కోర్టు ఆదేశాల్ని పక్కన పెట్టి ప్రక్రియను నిలిపివేసిందని వాదించారు. సుప్రీంకోర్టు పదవీకాలం పూర్తయ్యేలోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను ముగించాలని చెప్పినప్పటికీ, 18 నెలల తర్వాత మాత్రమే రిజర్వేషన్లు తీసుకురావడం జరిగిందని ఆయన ఆరోపించారు.
ఈ సమయంలో, ప్రభుత్వం ఎన్నికలను త్వరలో నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపాడు. అయితే ధర్మాసనం దీనిపై స్పందిస్తూ, ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం సూచనలు పొందడానికి మరో వారం సమయం కోరగా, కోర్టు సమాధానంతో తప్పకుండా రావాల్సిందేనని హెచ్చరించింది.
అదేవిధంగా, రిజర్వేషన్లు 50%కు మించకూడదన్న నిబంధనను కూడా హైకోర్టు గుర్తు చేసింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలలకు మించి ఎన్నికలు వాయిదా వేయడం తగదని స్పష్టంచేసింది.
