Crime: చట్నీ మీద పడిందని దారుణ హత్య

Brutal murder over chutney Incident at Hyderabad

Brutal murder over chutney Incident at Hyderabad

Crime: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చట్నీ బట్టలపై పడిందన్న చిన్న కారణంతో నలుగురు యువకులు ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అర్థరాత్రి లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించి, గంటలపాటు చిత్రహింసలకు గురి చేసి, చివరకు ప్రాణాలు తీసిన ఈ కేసును రాచకొండ పోలీసులు వేగంగా విచారించి 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు.

నాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉప్పల్ కళ్యాణపురం నివాసి మురళీ కృష్ణ (45) సోమవారం రాత్రి ఎల్బీనగర్ వద్ద ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్తున్న మహమ్మద్ జునైద్ (18), షేక్ సైపుద్దీన్ (18), పొన్నా మణికంఠ (21), మరో 16 ఏళ్ల మైనర్ అతడిని కారులో ఎక్కించుకున్నారు.

మార్గమధ్యంలో ఉప్పల్ ప్రాంతంలోని ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఆగి టిఫిన్ చేస్తుండగా, మురళీ కృష్ణ చేతిలోని ప్లేట్‌ నుంచి చట్నీ అనుకోకుండా ఒక యువకుడి బట్టలపై పడింది. ఈ విషయాన్ని చిన్నగా తీసుకోక, కోపంతో నలుగురు అతడితో వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా మురళీ కృష్ణను బలవంతంగా తిరిగి కారులోకి ఎక్కించారు. ఇంటి వద్ద దించమని అతడు వేడుకున్నా, యువకులు పట్టించుకోలేదు.

తరువాత రెండు గంటల పాటు కారులోనే తిప్పుతూ, పిడిగుద్దులతో కొట్టి, సిగరెట్లతో కాల్చి హింసించారు. తెల్లవారుజాము 4:30 సమయంలో నాచారం పారిశ్రామికవాడలోని తెలంగాణ ఫుడ్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, కారులోనే కత్తితో దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించారు.

మురళీ కృష్ణ అక్కడి నుంచి తప్పించుకోవాలని కారులోంచి దూకి సుమారు 200 మీటర్లు పరిగెత్తినా, గాయాల వలన కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటన అనంతరం నిందితులు కారు శుభ్రం చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని పారేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ల ఆధారంగా గాలింపు నిర్వహించి మంగళవారం మౌలాలిలో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. కారును మరియు కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించగా, మైనర్ బాలుణ్ని సైదాబాద్ జువెనైల్ హోమ్‌కు పంపించారు.

Crime: చట్నీ మీద పడిందని దారుణ హత్య