Crime: ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను హత్య చేసే ఘటనలు పెరుగుతున్నాయి. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు వంటి కారణాలతో ఈ రకమైన కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. తాజాగా కరీంనగర్‌లో జరిగిన ఓ దారుణం ఇదే విషయాన్ని మళ్లీ చర్చనీయాంశం చేసింది. చెడు అలవాట్లకు బానిసైన ఓ భార్య, మరో ఐదుగురి సహాయంతో భర్తను పద్ధతి ప్రకారం హత్య చేయడం సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్తే — కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్, మౌనిక దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సురేష్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొద్ది నెలలుగా వీరి మధ్య విభేధాలు పెరిగిపోయాయి. మౌనిక చెడు వ్యసనాలకు అలవాటు పడడంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. చివరికి భర్తను హత్య చేయాలని మౌనిక నిశ్చయించుకుంది.
ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆమె బంధువు అరిగే శ్రీజ సహా మరో ఐదుగురిని కలుపుకుంది. శ్రీజ పరిచయం చేసిన మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ, అతని స్నేహితురాలు సంధ్య, మరో వ్యక్తి అజయ్ ఈ కుట్రలో పాల్గొన్నారు. అందరూ కలిసి సురేష్‌ను చంపే ప్రణాళిక రచించారు.
శివకృష్ణ, వయాగ్రా, బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో ఇస్తే ప్రాణాంతకమని చెప్పడంతో, మౌనిక మెడికల్ షాపులోంచి సుమారు 15 మాత్రలు తెచ్చింది. ఆ టాబ్లెట్లు కూరలో కలిపి సురేష్‌కు ఇచ్చింది. అయితే కూరలో వాసన రావడంతో సురేష్ తినకుండానే ప్లేట్ వదిలి వెళ్లిపోయాడు. దీంతో మొదటి ప్రయత్నం విఫలమైంది.
తరువాత రెండో ప్లాన్ ప్రకారం, బీపీ మాత్రలు, నిద్రమాత్రల పొడి మద్యంలో కలిపి సురేష్‌కు ఇచ్చింది. తాగిన వెంటనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయాన్నే మౌనిక చీరతో ఒక చివర కిటికీ గ్రిల్‌కు కట్టి, మరో చివర సురేష్ మెడకు బిగించి ఉరేసి చంపేసింది.
తర్వాత హత్యను కప్పిపుచ్చుకునేందుకు కొత్త కథ అల్లింది. సురేష్ లైంగిక చర్య సమయంలో సృహ కోల్పోయాడని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పింది. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి నాటకం ఆడింది. కానీ అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాధారణ మరణంగానే చూపించే ప్రయత్నం చేసింది.
తర్వాత కొందరి సలహా మేరకు “కేసు పెడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి” అని భావించి, టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో మౌనిక ప్రవర్తనపై అనుమానాలు కలిగిన పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ఫోన్ రికార్డులు, సాక్ష్యాలు పరిశీలించగా భర్త హత్య పూర్తిగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని తేలింది.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు మౌనికతో పాటు, ఆమెకు సహకరించిన శ్రీజ, శివకృష్ణ, అజయ్, సంధ్య, దేవదాస్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తూ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
