Plane Crash: ఇటీవల అమెరికా కెంటకీలో జరిగిన ఘోర విషాదంలో కార్గో విమానం కూలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం (Kentucky Plane Crash)పై దర్యాప్తు కొనసాగుతుండగా, ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. టేకాఫ్ సమయంలో విమానానికి ఎడమ వైపు ఉన్న రెక్కపై అమర్చిన ఇంజిన్ ముందుగా వదులై, కొద్ది సేపటికే పూర్తిగా విడిపడడంతో ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం నిర్ధరించింది. మండుతున్న ఇంధన మంటల్లో ఇంజిన్ ఊడిపడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ప్రమాదం సమయంలో విమానం భూమికి కేవలం 30 అడుగుల ఎత్తులోనే ఉందని అధికారులు తెలిపారు. నవంబర్ 5న లూయివ్‌విల్లే మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హొనోలులుకు బయల్దేరిన ఈ కార్గో విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఫలితంగా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బందితో పాటు గ్రౌండ్‌లో పనిచేస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 2.8 లక్షల గ్యాలన్ల ఇంధనం ఉండటంతో మంటలు మరింత విస్తరించాయని అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
