Telangana: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఓ హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ అల్లుడు తన వృద్ధ అత్తపై రెండుసార్లు లైంగిక దాడి చేయడానికి యత్నించగా, రెండవసారి తనని రక్షించుకునేందుకు ఆవేశంతో ఆ వృద్ధురాలు అతన్ని హత్య చేసింది.
ఈ ఘటన ముతోల్ మండలంలోని తరోడా గ్రామంలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని హిమాయత్ నగర్‌కు చెందిన షేక్ నజీమ్ (45) తన భార్య, కుమారుడు, అత్తతో కలిసి వలస కూలీలుగా నిర్మల్ జిల్లా తరోడా గ్రామానికి వచ్చారు.
అక్కడే ఓ ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే గత కొంత కాలంగా మద్యం బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. పదిరోజుల క్రితం నజీమ్ భార్య తాపీ పనుల కోసం కుమారుడితో కలిసి శివుని అనే గ్రామానికి వెళ్లడంతో, ఇంట్లో వృద్ధురాలైన అత్త (68) ఒంటరిగా మిగిలిపోయింది.
ఈలోగా మద్యం తాగిన నజీమ్ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆరోగ్యం కుదుటపడడంతో సోమవారం ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఇంతలో ఆమె తిరిగి వచ్చిందని తెలిసిన నజీమ్, అదే రాత్రి మద్యం తాగి మరోసారి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అయితే ఈసారి మాత్రం ఆ వృద్ధురాలు భయపడకుండా ఎదురెళ్లింది.
పక్కన ఉన్న కర్రతో అతనిపై బలంగా దెబ్బతీసింది. స్పృహతప్పి పడిపోయిన నజీమ్‌ను అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. ఈ విధంగా ఆవేశంలో తన మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకుంది ఆమె. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఘటన విషయం తెలుసుకున్న నజీమ్ భార్య, కుమారుడు తరోడా గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామమైన మహారాష్ట్రకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
