Cyclone Alert: మొంథా తుపాన్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే రాష్ట్రానికి మరో తుపాన్ ముప్పు దగ్గర పడుతోంది. వాతావరణ కేంద్రం ఇప్పటికే దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా నవంబర్ 22 (శనివారం) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాతావరణ పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది.
ఈ ప్రభావంతో నవంబర్ 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 42 50101లను అందుబాటులో ఉంచింది.
శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.
టెలంగాణలో కూడా వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. నవంబర్ 23 నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 21, 22 తేదీల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని, అయితే చలి తీవ్రత అలాగే ఉంటుందని తెలిపింది. రాబోయే రెండు రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తగ్గవచ్చని అంచనా వేసింది.
