Free Bus Ride : మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 83 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని, దీని వల్ల రూ. 2,840 కోట్లు ఆదా అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 10) తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ)పై జరిగిన సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాలక్ష్మి పథకం అమలు గురించి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వివరించారు.
ఆర్టీసీ బస్సుల్లో 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీనివల్ల మహిళలకు రూ.2,840.71 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. 7,292 ఆర్టీసీ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ నూతన బస్సుల కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన అవసరాలు, నూతన మార్గాలను అందుకు ప్రతిపాదిక చేసుకోవాలని సూచించారు.
* మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్టీసీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి గారు… pic.twitter.com/lIUc9qQ7Pk
— Telangana CMO (@TelanganaCMO) September 10, 2024
మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరిగిందని రవాణా శాఖ మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు కావడంపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలను కూడా ప్రజెంటేషన్‌లో చూపించారు.
బస్సులను కొనుగోలు చేసే ముందు బస్సు ప్రయాణం, కొత్త ప్రయాణ మార్గాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్టీసీ అధికారులకు సూచించారు. వివిధ బ్యాంకుల నిధుల వినియోగం, ఉద్యోగుల భవిష్య నిధి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల గురించి టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తంగా ఆర్టీసీకి రూ.6,332 కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయి.