Water Contamination : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో మిషన్ భగీరథ నారాయణఖేడ్ గ్రిడ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి రవికుమార్, ఇంట్రా ఏఈఈ శ్రీకాంత్, సంజీవనరావుపేట గ్రామ కార్యదర్శి నాగలక్ష్మి ఉన్నారు.
ఘటనపై మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) రఘువీర్ మాట్లాడుతూ.. ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు. విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి నివేదిక అందజేస్తామన్నారు. పలు నివేదికల ప్రకారం, నీటి సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. గత మూడు రోజులుగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు.
గ్రామంలోని రెండు బోర్‌వెల్‌ల మోటార్లు పనిచేయకపోవడంతో నివాసితులు అక్టోబర్ 12, శనివారం తాగడానికి బహిరంగ బావి నుండి నీటిపై ఆధారపడవలసి వచ్చింది. దీని తరువాత, చాలా మంది గ్రామస్తులు వాంతులు, విరేచనాలను అనుభవించారు. తరువాత ఇద్దరు వ్యక్తులు బోడ మహేష్, 24, మరియు బైకాడి సాయమ్మ, 87, కలుషిత నీరు తాగడం వల్ల మరణించారు, అయితే మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు ప్రస్తుతం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా, గోదావరి నదీజలాల శుద్ధి చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి తగిన సహాయం అందించాలని, భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.