Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. తమ అభిమాన స్టార్ ఆటగాడిని కళ్లారా చూడాలనే ఆశతో వేలాది మంది అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియానికి తరలివచ్చారు. అయితే నిర్వహణ లోపాల కారణంగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీని చూడటానికి పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో కొంతమంది అభిమానులు హింసకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ గందరగోళం కారణంగా స్టేడియానికి వచ్చిన మెస్సీ కేవలం కొద్ది నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.12 వేల వరకు ఖర్చు చేసి టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ, కనీసం తమ అభిమాన ఆటగాడు ముఖం కూడా చూడలేకపోయామని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మరియు నిర్వాహకులు మెస్సీ సమయాన్ని వృథా చేశారని కొందరు అసహనం వ్యక్తం చేశారు. డార్జిలింగ్ నుంచి వచ్చిన ఓ మహిళా అభిమాని, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న మెస్సీని ప్రత్యక్షంగా చూడలేకపోవడం తనకు ఎంతో నిరాశ కలిగించిందని తెలిపింది.
#WATCH | Kolkata, West Bengal: A fan of star footballer Lionel Messi says, “It was really disappointing, we came all the way from Darjeeling for this… We couldn’t even see him properly, and that was the most disappointing thing I have ever witnessed…” https://t.co/Ce4kNu8dBH pic.twitter.com/dgBSOIMEoG
— ANI (@ANI) December 13, 2025
ఇదిలా ఉండగా, ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా మెస్సీ శనివారం తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఆయన మూడు రోజుల పాటు నాలుగు నగరాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.
కోల్‌కతా పర్యటన సందర్భంగా ఏర్పడిన గందరగోళంలో కొంతమంది అభిమానులు స్టేడియాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. వాటర్ బాటిళ్లు విసిరేయడం, సీట్లు, కుర్చీలు ధ్వంసం చేయడం, బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. టెంట్‌లు, గోల్‌పోస్ట్‌లను ధ్వంసం చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) జావేద్ షమీమ్, ‘గోట్ ఇండియా టూర్ 2025’ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వెల్లడించారు. అలాగే టికెట్లకు చెల్లించిన మొత్తాన్ని అభిమానులకు తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Also Read: Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం
Lionel Messi: రూ.12 వేలతో టికెట్ కొన్నాడు.. మెస్సీని చూడలేదన్న నిరాశతో..
