Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, 15 నవంబర్ 2023న వాంఖడే స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై అతడు వన్డేల్లో తన 50వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో విరాట్, అప్పటి వరకు 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ తెందూల్కర్ రికార్డును తిరగరాశాడు.
ఈ ఘనతను సచిన్ 451 వన్డే ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, కోహ్లీ మాత్రం కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. వరల్డ్ కప్ 2023లో 49వ సెంచరీ చేసిన విరాట్, తదుపరి ఇన్నింగ్స్ అయిన 279వ ఇన్నింగ్స్‌లోనే 50వ సెంచరీ బాదుతూ చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌ను సచిన్ స్వయంగా స్టేడియంలో కూర్చొని చూశాడు. కోహ్లీ తన రికార్డును బ్రేక్ చేయడం చూసి అక్కడికక్కడే అతడిని అభినందించడం విశేషం.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 293 ఇన్నింగ్స్‌ల్లో 51 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఈ అరుదైన ఘనత సాధించిన రోజును గుర్తు చేస్తూ బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేసింది. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇప్పటికే విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికి, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా సిరీస్‌లో తిరిగి జట్టులో చేరిన కోహ్లీ, మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు అయినా, మూడో వన్డేలో 81 బంతుల్లో అజేయంగా 74 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
