BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక

Mithun Manhas elected new BCCI President, succeeds Roger Binny

Mithun Manhas elected new BCCI President, succeeds Roger Binny

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తర్వాత ఈ పదవిని చేపట్టిన మూడో మాజీ క్రికెటర్‌గా మిథున్ మన్హాస్ చరిత్రలో నిలిచారు.

గత ఆగస్టులో రోజర్ బిన్నీ రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) నుంచి మిథున్ మన్హాస్ పేరు నామినేట్ కావడంతో ఆయన రేసులోకి వచ్చారు. ఏజీఎంలో ఆయన ఎన్నికను అధికారికంగా ఖరారు చేశారు.

అదే సమావేశంలో ఇతర కీలక స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. రాజీవ్ శుక్లా మరోసారి వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతుండగా, దేవాజిత్ సైకియా కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ బాధ్యతలు స్వీకరించారు.

మిథున్ మన్హాస్ నియామకంపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందిస్తూ, “ఇది చారిత్రక క్షణం. జమ్మూకశ్మీర్‌లోని దూర ప్రాంతమైన దోడా జిల్లాకు చెందిన మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణం” అని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

మన్హాస్ క్రికెట్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఢిల్లీ తరఫున అద్భుత రికార్డు సృష్టించారు. తర్వాత జమ్మూకశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, కోచ్‌గా కూడా సేవలందించారు. ఆయన 147 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 9,714 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పుణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు.

క్రికెట్‌పై లోతైన అవగాహన కలిగిన సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: Gold: భగ్గుమంటున్న బంగారం ధరలు.. వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీకి పెరుగుతున్న డిమాండ్

BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక