PV Sindhu: కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ–క్వార్టర్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ జపాన్ క్రీడాకారిణి టోమోకా మియాజాకిని సింధు 21–8, 21–13తో స్ట్రెయిట్ గేమ్‌లలో ఓడించింది.
ఈ విజయంతో మియాజాకిపై సింధు ముఖాముఖి రికార్డు 2–1కు పెరిగింది. కేవలం 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తన కచ్చితమైన అటాకింగ్ షాట్లు, వేగవంతమైన రిటర్న్స్‌తో ఆకట్టుకుంది. ఆట ప్రారంభంలోనే 5–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు, తరువాత వరుసగా 13 పాయింట్లు సాధించి 18–4 లీడుతో గేమ్‌ను తనదైన శైలిలో ముగించింది. రెండో గేమ్ కూడా పెద్దగా పోటీ లేకుండానే సాగింది.
మెన్స్ డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ షెట్టి తమ పోరును కొనసాగించారు. ప్రీ–క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 17 జునైద్ ఆరిఫ్ – రాయ్ కింగ్ యాప్ (మలేషియా) జోడిపై 21–18, 21–11తో విజయం సాధించి క్వార్టర్స్ బర్త్‌ను దక్కించుకున్నారు.
అయితే మెన్స్ సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు కొనసాగలేకపోయారు. ఆయుష్ షెట్టి కఠిన పోరులో 18–21, 21–18, 12–21తో చైనా క్రీడాకారుడు షుయ్ యి కీ చేతిలో ఓటమిపాలయ్యాడు. లక్ష్యసేన్ కూడా 20–22, 15–21తో హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యియు ముందు పరాజయం పొందాడు.
