Test Twenty: క్రికెట్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లను కలిపి రూపొందించిన ‘టెస్ట్ 20’ అనే సరికొత్త ఫార్మాట్‌ను పరిచయం చేయబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫార్మాట్ ద్వారా క్రికెట్ ప్రేక్షకులకు టెస్టుల సీరియస్ ఆలోచనతో పాటు టీ20ల ఉత్సాహం, వేగం రెండూ ఒకే మ్యాచ్‌లో అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కాన్సెప్ట్ రూపొందించారు.
‘టెస్ట్ 20’లో రెండు జట్లు ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌లు, అంటే ప్రతి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు చొప్పున ఆడతాయి. అంటే, ఆటగాళ్లకు టెస్టుల మాదిరిగా రెండుసార్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీ20 ఫార్మాట్ తరహాలో వేగంగా రన్‌లు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధానం ఆటలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుంది.
ఈ ఫార్మాట్ స్థాపకుడు గౌరవ్ బహిర్వాని, 2026 జనవరిలో ‘జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్‌షిప్’ పేరుతో తొలి సీజన్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నీ ద్వారా యువ క్రికెటర్లకు కొత్త తరహా అనుభవం లభిస్తుందని ఆయన తెలిపారు.
ఇదే కాకుండా, ఈ ఫార్మాట్‌కి ప్రముఖ క్రికెట్ దిగ్గజాలు — ఏబీ డివిలియర్స్, క్లైవ్ లాయిడ్, మాథ్యూ హెడెన్, హర్భజన్ సింగ్ — సలహాదారులుగా వ్యవహరించనున్నారు. వీరి అనుభవం, సలహాలతో ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ ప్రపంచంలో ఈ కొత్త ‘టెస్ట్ 20’ ఫార్మాట్ ఎలా విజయవంతమవుతుందో చూడాల్సి ఉంది, కానీ అభిమానుల్లో మాత్రం ఇప్పటినుంచే ఆసక్తి రగిలిస్తోంది.
