UPI: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు విద్యా రంగంలోనూ ఆ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా స్కూళ్లలో ఫీజుల వసూలు విధానాన్ని ఆధునికీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, సంబంధిత విభాగాలకు లేఖలు రాసి, అడ్మిషన్ ఫీజు, పరీక్ష ఫీజు, స్కూల్ కార్యకలాపాలకు సంబంధించిన ఇతర లావాదేవీలన్నింటికీ UPI, మొబైల్ పేమెంట్స్ వంటి డిజిటల్ విధానాలను ఉపయోగించాలని సూచించింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజువారీ లావాదేవీలలో ఎక్కువమంది ప్రజలు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా UPI చెల్లింపులు చేస్తున్నారు. ఈ సౌలభ్యాన్ని విద్యా రంగంలో కూడా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. స్కూల్ ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఇక బ్యాంకులకు, కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్ ద్వారా నేరుగా చెల్లించే అవకాశం లభించనుంది.
కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయంతో పాటు CBSE, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ముందుగా ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఈ చర్యతో పారదర్శకత పెరగడమే కాకుండా, సమయం, శ్రమ రెండింటినీ ఆదా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా, విద్యారంగంలో డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరగడం, ఆధునిక భారత దిశగా మరో ముందడుగుగా నిలవనుంది.
