Super Moon: ఈ రోజు ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇవాళ పౌర్ణమి సందర్భంగా సూపర్ మూన్ దర్శనమివ్వబోతోంది. సాయంత్రం సుమారు 6 గంటల నుంచి చంద్రుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రోజు కనిపించే చంద్రుడు మరింత ఆకర్షణీయంగా ఉండబోతున్నాడు.
సూపర్ మూన్ సమయంలో చంద్రుడు సాధారణ పరిమాణం కంటే సుమారు 15 శాతం ఎక్కువగా, అలాగే సాధారణ ప్రకాశంతో పోలిస్తే దాదాపు 30 శాతం ఎక్కువ కాంతితో మెరిసిపోతాడు. అందుకే ఆకాశాన్ని చూస్తే చంద్రుడు చాలా దగ్గరగా, పెద్దగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రత్యేక పరికరాలు లేకుండానే, కంటితోనే నేరుగా వీక్షించవచ్చు.
ఖగోళ శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, ఈ సమయంలో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తాడు. ఇవాళ సూపర్ మూన్ సమయంలో చందమామ భూమికి సుమారు 3.6 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు పౌర్ణమి వస్తే దానినే సూపర్ మూన్గా పిలుస్తారు.
ఇదే సమయంలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంటుంది. భూమి సూర్యుడికి దగ్గరగా ఉండే దశలో ఉండటం, చంద్రుడు సూర్యుడికి పూర్తిగా ఎదురుగా రావడం వల్ల చంద్రుడిపై సూర్యకాంతి పూర్తిగా పడుతుంది. దీంతో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతాడు. ఈ మూడు పరిస్థితులు ఒకేసారి కలిసిరావడం వల్లే సూపర్ మూన్ అద్భుతంగా కనిపిస్తుంది.
ఆకాశాన్ని గమనించే వారికి, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ రోజు ప్రత్యేకం. మబ్బులు లేకపోతే, ఓపెన్ ప్రదేశంలో నిలబడి చంద్రుడిని చూస్తే ఈ ఖగోళ అద్భుతాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. సూపర్ మూన్ దృశ్యం ప్రతి రోజూ కనిపించదు కాబట్టి, ఈ అవకాశాన్ని మిస్ కాకుండా వీక్షించమని నిపుణులు సూచిస్తున్నారు.
