Hardoi Bank : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సెప్టెంబర్ 25న ఒక మహిళ తన వైద్యం కోసం డబ్బు తీసుకునేందుకు వేచి ఉండగా బ్యాంకులో మరణించిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పలు నివేదికల ప్రకారం, మహిళ అనారోగ్యంతో ఉన్నందున, ఆమె తన చికిత్స కోసం డబ్బు అవసరం కావడంతో విత్‌డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లింది. అయితే, ఆమె వేలిముద్ర బ్యాంకు రికార్డుతో సరిపోలకపోవడంతో, సిబ్బంది క్యాష్ విత్ డ్రాల్ ను ప్రాసెస్ చేయడానికి నిరాకరించారు. ఈ సమయంలో అస్వస్థతకు గురైన మహిళ బ్యాంకులోనే కుప్పకూలి మృతి చెందింది.
ఈ ఘటనతో మహిళ కుటుంబీకులు బ్యాంకులో కలకలం సృష్టించారు. బ్యాంకు సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురై మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామువాపూర్ గ్రామానికి చెందిన భయ్యా లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య రామశ్రీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైందని తెలిపారు. చికిత్సకు డబ్బులు లేకపోవడంతో భార్యతో కలిసి డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. డబ్బు విత్‌డ్రా చేయమని బ్యాంకు మేనేజర్ తమ అభ్యర్థనను తిరస్కరించారని, తనను బ్యాంకు నుంచి బయటకు నెట్టారని ఆయన ఆరోపించారు. డబ్బు కోసం గంటల తరబడి నిరీక్షించగా, రామశ్రీ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.