Railway: టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే వారిపై దక్షిణ మధ్య రైల్వే (SCR) కఠినంగా వ్యవహరించింది. జోన్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మందికి పైగా టికెట్ లేని ప్రయాణికులు పట్టుబడ్డారు. వీరిపై ఫైన్ విధించి ఒకే రోజు రూ.1.08 కోట్లు వసూలు చేయడం SCR చరిత్రలో తొలిసారి చోటుచేసుకుంది.
సాధారణంగా రోజువారీగా జరిపే తనిఖీల్లో సగటున రూ.47 లక్షల వరకు ఫైన్లు వసూలవుతుంటాయి. అయితే అక్టోబర్ 13న జరిపిన ఈ ప్రత్యేక తనిఖీలు రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చాయి. జోన్ వారీగా పరిశీలిస్తే – విజయవాడ డివిజన్ అత్యధికంగా రూ.36.91 లక్షలు వసూలు చేసింది. తర్వాత గుంతకల్లు డివిజన్ రూ.28 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్ రూ.27.9 లక్షలు, గుంటూరు రూ.6.46 లక్షలు, హైదరాబాద్ రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్ రూ.4.08 లక్షలు వసూలు చేశాయి.
రైల్వే అధికారులు టికెట్ లేకుండా ప్రయాణించడాన్ని చట్టపరమైన నేరంగా పరిగణిస్తున్నట్లు హెచ్చరించారు. టికెట్ లేకుండా లేదా తప్పుగా ప్రయాణించిన వారిపై ఫైన్‌తో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎల్లప్పుడూ చెల్లుబాటు అయ్యే టికెట్‌తోనే రైల్లో ప్రయాణించాలని రైల్వే విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలతో SCR, టికెట్ లేని ప్రయాణాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టు మరోసారి స్పష్టమైంది.
