India: ‘జనగణమన కన్నా వందేమాతరమే ముందు పాడాలి’

Play National Song Before National Anthem: New 'Vande Mataram' Guidelines

Play National Song Before National Anthem: New 'Vande Mataram' Guidelines

India: “వందేమాతరం” గీతానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2026 జనవరి 28 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జాతీయ గీతం జనగణమనకు అమల్లో ఉన్న విధానాల తరహాలోనే, వందేమాతరం గీతం పాడటం, వాయించడం, ప్రదర్శనకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రోటోకాల్‌లను పాటించాలని కేంద్రం ఆదేశించింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం, ఏదైనా ప్రభుత్వ లేదా అధికారిక కార్యక్రమంలో వందేమాతరం పాడినా లేదా ప్లే చేసినా, గీతం పూర్తి ఆరు చరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎక్కువగా మొదటి రెండు చరణాలకే పరిమితమయ్యేవారు. కానీ ఇకపై అధికారిక కార్యక్రమాల్లో మొత్తం ఆరు చరణాలే ప్రామాణికంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఆచరణాత్మక పరిస్థితులను బట్టి ప్రదర్శన విధానంలో స్వల్ప మార్పులు ఉండవచ్చని చెప్పినా, అధికారికంగా పూర్తి గీతానికే గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ పూర్తి గీతం వ్యవధి సుమారు 3 నిమిషాలు 10 సెకన్లు.

ఒకే కార్యక్రమంలో వందేమాతరం, జాతీయ గీతం జనగణమన రెండింటినీ ప్రదర్శించాల్సి వస్తే, ముందుగా వందేమాతరం పాడాలి. ఆ తర్వాతే జనగణమన ఆలపించాల్సి ఉంటుంది. అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఒకే విధమైన క్రమం ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, వందేమాతరం పాడే సమయంలో గౌరవం, మర్యాదలు కూడా జాతీయ గీతానికి ఉన్నట్టే పాటించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. గీతం వినిపిస్తున్నప్పుడు హాజరైన ప్రతి ఒక్కరూ లేచి నిలబడి గౌరవం చూపాల్సి ఉంటుంది.

జాతీయ జెండా ఎగురవేయడం, రాష్ట్రపతి లేదా గవర్నర్ రాక, వారి ప్రసంగాలకు ముందు లేదా తర్వాత, దేశాన్ని ఉద్దేశించి జరిగే అధికారిక ప్రసంగాల సందర్భాల్లో వందేమాతరం తప్పనిసరిగా పాడాలని పేర్కొన్నారు. అలాగే పద్మ అవార్డుల ప్రదానోత్సవాలు వంటి పౌర పురస్కారాల కార్యక్రమాల్లో రాష్ట్రపతి హాజరైతే అక్కడ కూడా వందేమాతరం ఆలపించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు ప్రధానంగా ప్రభుత్వ వేడుకలు, జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, విద్యా సంస్థల అధికారిక ఈవెంట్లు, ప్రభుత్వ ప్రోటోకాల్‌తో కూడిన కార్యక్రమాలకు వర్తిస్తాయి. ఇవి శిక్షాత్మక చట్టాలు కాకుండా పరిపాలనా విధానాలుగా మాత్రమే అమలవుతాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంది. 1875 నవంబర్ 7న అక్షయ నవమి రోజున ఈ గీతాన్ని రచించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన రచించిన ‘ఆనందమఠ్’ నవలలో ఈ గేయం తొలిసారిగా వెలుగు చూసింది. తరువాత ఇది స్వాతంత్ర్య పోరాటంలో దేశభక్తికి ప్రతీకగా మారింది. వందేమాతరం దేశానికి అందించిన చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, ఈ గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

Also Read: Corruption: భారత్‌లో అవినీతి తగ్గిందా..?

India: ‘జనగణమన కన్నా వందేమాతరమే ముందు పాడాలి’