Viral: అక్టోబర్ 29న వివాహం చేసుకున్న నూతన దంపతులు సూరజ్ శివన్న (36), గణవి (26) జీవితం విషాదాంతంగా ముగిసింది. హనీమూన్ సమయంలో తలెత్తిన గొడవలు చివరికి ఇద్దరూ ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరాయి. గణవి బెంగళూరులో ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతికి రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్లో ఓ హోటల్‌లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రెండు ఘటనలు వెయ్యి కిలోమీటర్ల దూరంలో, రెండు రోజుల వ్యవధిలో జరగడం తీవ్ర కలకలం రేపింది.
వివాహం తర్వాత హనీమూన్ కోసం ఈ జంట శ్రీలంకకు వెళ్లింది. అక్కడే ఇద్దరి మధ్య విభేదాలు మొదలవడంతో వారు మధ్యలోనే ప్రయాణాన్ని ముగించి బెంగళూరుకు తిరిగి వచ్చారు. అనంతరం గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో అవమానం, తిరస్కారం ఎదురయ్యాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన గణవి డిసెంబర్ 23న ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరకు మృతి చెందింది.
గణవి మరణం అనంతరం ఆమె కుటుంబం సూరజ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూరికి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్డులోని ఓ హోటల్‌లో సూరజ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎలా విషాదంగా ముగిసిందో చాటుతోంది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నాయో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.
