Gold: విదేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావొచ్చంటే..

New baggage rules 2026: How much gold and silver can you carry from abroad?

New baggage rules 2026: How much gold and silver can you carry from abroad?

Gold: బ్యాగేజ్ రూల్స్–2026 ప్రకారం ఆభరణాల విషయంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న విలువ ఆధారిత పరిమితిని రద్దు చేసి, దాని స్థానంలో బరువు ఆధారిత మినహాయింపు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి బంగారు ఆభరణాలు తీసుకువచ్చే సమయంలో వాటి ధరను అంచనా వేయడంలో ఎయిర్‌పోర్టుల్లో తరచూ వివాదాలు, ఆలస్యాలు ఎదురయ్యేవి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు ధరకు బదులుగా బరువునే ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకునే విధానం అమలు చేస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికుల వర్గాల ఆధారంగా డ్యూటీ-ఫ్రీ అలవెన్స్ పరిమితులను సవరించారు. భారతీయ నివాసితులు, భారత సంతతికి చెందిన పర్యాటకులు, అలాగే చెల్లుబాటు అయ్యే నాన్-టూరిస్ట్ వీసా కలిగిన విదేశీయులు రూ.75,000 వరకు విలువైన డ్యూటీ-ఫ్రీ వస్తువులను తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి రూ.50,000 మాత్రమే ఉండేది. ఇక విదేశీ సంతతికి చెందిన పర్యాటకులు ఎలాంటి సుంకం చెల్లించకుండా రూ.25,000 వరకు విలువైన వస్తువులను తీసుకురావచ్చు. సిబ్బందికి మాత్రం డ్యూటీ-ఫ్రీ అలవెన్స్ పరిమితి రూ.2,500గా నిర్ణయించారు.

ఆభరణాల విషయంలో మరింత స్పష్టత ఇచ్చేలా ప్రభుత్వం బరువు ఆధారిత మినహాయింపును అమలు చేసింది. కనీసం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి భారత్‌కు తిరిగివచ్చే భారతీయులకు ఈ సడలింపు వర్తిస్తుంది. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. ఇతర ప్రయాణికులకు ఈ పరిమితి 20 గ్రాములు. గతంలో ఖరీదైన నగలు తక్కువ బరువు ఉన్నా ఎక్కువ సుంకం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.

ఈ విధానం వల్ల ప్రయాణికులకు, కస్టమ్స్ అధికారులకు ప్రక్రియ మరింత సరళంగా, పారదర్శకంగా మారనుంది. ఆభరణాల బరువు విషయంలో తలెత్తే వివాదాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ మినహాయింపు కేవలం వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది.

బంగారు కడ్డీలు, నాణేలు లేదా ఇతర విలువైన లోహాలను తీసుకువచ్చే వారు తప్పనిసరిగా కస్టమ్స్ వద్ద వివరాలు వెల్లడించాలి. నిర్ణీత బరువుకు మించి ఆభరణాలు తీసుకువస్తే అదనపు భాగంపై కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యం ఆభరణాల పరిమితిని పెంచడం కాదు, వాటిని తీసుకువచ్చే ప్రక్రియను సులభతరం చేయడమే.

Also Read: Viral: పెళ్లి చేయాలంటూ.. సెల్ టవర్‌పై నుంచి పడి యువకుడు మృతి!

Gold: విదేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావొచ్చంటే..