Crime: రాజస్థాన్ రాష్ట్రంలోని డీగ్ జిల్లాలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు పుట్టడం లేదని కోడలిని అత్తామామలు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఖోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాక్రా గ్రామంలో చోటుచేసుకుంది.
మృతురాలు సరళ, 2005లో గ్రామానికి చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. అయితే వివాహానంతరం ఆమెకు పిల్లలు లేవు. ఈ కారణంగానే భర్త అశోక్ తరచూ వేధించేవాడని, కొట్టేవాడని సరళ సోదరుడు విక్రాంత్ ఆరోపించారు. కుటుంబ సభ్యులు కూడా ఇదే కారణంగా హత్య జరిగిందని పోలీసులకు తెలిపారు.
హత్య చేసిన తర్వాత, ఈ దారుణాన్ని ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలా చూపేందుకు కుట్ర పన్నారు. ఇంట్లోనే సరళ మృతదేహాన్ని మంటల్లో కాల్చి, అగ్నిప్రమాదంలో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. తరువాత అంత్యక్రియలు చేయాలని తొందరపడ్డారు.
కానీ గ్రామస్తులకు అనుమానం రావడంతో, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫోన్ ద్వారా అత్తామామలకు సంప్రదించి అంత్యక్రియలు ఆపాలని ఆదేశించారు. అయినప్పటికీ వారు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, దహన సంస్కారాలు పూర్తికాకముందే పోలీసులు అక్కడికి చేరుకొని సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలు పుట్టలేదనే కారణంతో కోడలిని హత్య చేయడం, దానిని ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేయడం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
