Degree: చాలామందికి ‘ఫైనల్ ఎగ్జామ్’ అంటే చదువులకి ముగింపులా అనిపిస్తుంది. సాదారణంగా చాలా మంది ఒక డిగ్రీ, గరిష్టంగా రెండు డిగ్రీలు సాధించి జీవితంలో ముందుకెళ్లి పోతారు. కానీ చెన్నైకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎన్. పార్థిబన్ కి మాత్రం చదువు ఒక గమ్యం కాదు, అది ఆయన జీవిత ప్రయాణం. అందుకే ఆయనను ప్రేమగా ‘జ్ఞాన భాండాగారం’ అని పిలుస్తారు.
ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే..
తన మొదటి డిగ్రీలో పార్థిబన్ గారు కేవలం పాస్ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఆ రిజల్ట్ చూసి ఆయన తల్లి చాలా నిరాశ చెందింది. ఆ క్షణం ఆయన హృదయంలో ఒక్కటే కోరిక మెదిలింది.
“ఏదో ఓ రోజు నన్ను చూసి అమ్మ గర్వపడాలి” అన్న సంకల్పం ఆయనలో పుట్టింది.
అదే సంకల్పం తర్వాత జీవితకాల అభిరుచిగా మారింది.

చదువే ఆయన శ్వాసగా..
1981 నుండి ఇప్పటివరకు అతను చదువుతూనే ఉన్నారు. ఒక్కో పరీక్ష, ఒక్కో కోర్సు పూర్తవుతూనే మరొకటి ప్రారంభించడం మొదలుపెట్టారు. అలా ఏమాత్రం అలసట లేకుండా, చదువు మీద ప్రేమ మరింత పెరుగుతూ వచ్చింది.
ఇప్పటి వరకు ఆయన 150కి పైగా డిగ్రీలు, డిప్లొమాలు సాధించారు. ఆయన అర్హతలను చూస్తే ఒక యూనివర్శిటీ కోర్సుల జాబితాలా ఉంటాయి:
-
ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లా వంటి అనేక సబ్జెక్టులలో అనేక మాస్టర్స్ డిగ్రీలు
-
12 M.Phil. డిగ్రీలు
-
ప్రస్తుతం నాలుగో పీహెచ్డి కొనసాగిస్తున్నారు.
జీతంలో 90% చదువులకే..
తన అభిరుచికి నిధులు సమకూర్చుకోవడానికి ఆయన తన సంపాదనలో 90% ను యూనివర్సిటీ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్ మీద ఖర్చు చేస్తారు. తెల్లవారుజాము నుంచీ రాత్రి వరకు వివిధ కళాశాలల్లో బోధిస్తారు. క్లాసులు మధ్యలో వచ్చే చిన్న చిన్న విరామాలను కూడా ఆయన పుస్తకాల కోసమే వినియోగిస్తారు.
ఆయన నమ్మకం
ఒక్క ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నారు:
“అడ్డంకులు మనసులోనే ఉంటాయి. మనసు గెలిస్తే.. ఏదైనా సాధ్యమే..”
ఈ యాత్ర ఇంకా కొనసాగుతోంది
150 డిగ్రీలతో ఆపేయాలనే ఆలోచనే ఆయనకు లేదు.
అతని తదుపరి లక్ష్యం – 200 డిగ్రీలు దాటడంమే.
