Crime: బెంగళూరులో సంచలనం రేపిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు మిస్టరీ క్రమంగా వీడుతోంది. ఈ కేసులో ఆమె భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ థియేటర్లలోనే వాడే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఉపయోగించి కృతికాను హత్య చేసినట్లు విచారణలో తేలింది.
కృతికా రెడ్డి (డెర్మటాలజిస్ట్) మరియు మహేంద్ర రెడ్డి (సర్జన్) ఇద్దరూ బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో పనిచేసేవారు. ఒకే వృత్తి, ఒకే కార్యాలయంలో పనిచేస్తుండటంతో ఇరువురి ఇళ్ల పెద్దలు 2024 మే 26న వారి పెళ్లి జరిపించారు. అయితే ఏడాది కూడా పూర్తికాకముందే కృతికా అనుమానాస్పదరీతిలో మరణించడం పెద్ద షాక్‌గా మారింది.
మొదట ఆమె మరణాన్ని సహజ కారణాల వల్లేనని భావించారు. అనంతరం మహేంద్ర రెడ్డి బెంగళూరును వదిలి ఊడిపి జిల్లా మణిపాలుకు వెళ్లి అక్కడ క్లినిక్ ప్రారంభించాడు. అయితే కృతికా అక్క, రేడియాలజిస్ట్ డాక్టర్ నిఖితా రెడ్డికి మరణంపై అనుమానం కలిగి, పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు.
ఆరు నెలల తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) నివేదికలో కృతికా శరీరంలోని పలువురు అవయవాల్లో ప్రొపోఫోల్ మత్తు మందు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ రిపోర్ట్‌తో కేసు పూర్తిగా తిరగరాశారు. దీంతో మణిపాలులో ఉన్న మహేంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో మరింత షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. కృతికా మరణించిన వెంటనే తన ప్రియురాలికి “నీ కోసమే భార్యను చంపేశాను” అంటూ మెసేజ్ పంపినట్లు ఫోన్ విశ్లేషణలో తేలింది. ఆ మెసేజ్‌ను డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా పంపినట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత మహిళను కూడా పోలీసులు ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు లభించిన ఆధారాలు అన్నీ మహేంద్ర రెడ్డి హత్యలో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు నిర్ధారిస్తున్నాయని, త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. కృతికా ఆరోగ్యం బలహీనపడేందుకు కావాలనే మత్తు మందులు మరియు ప్రభావశీల ఇంజెక్షన్లు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని కూడా ఆయన తెలిపారు.
