Jaish-e-Mohammed: భారత్ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” దెబ్బకు బలహీనమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఎం) మళ్లీ చురుకుగా మారేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల ఆ సంస్థ తొలిసారిగా మహిళా విభాగం ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జేఎం అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదలైన లేఖలో “జమాత్ ఉల్ ముమినాత్” అనే మహిళా విభాగాన్ని స్థాపించినట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు ఆ విభాగానికి సభ్యులను చేరదీసేందుకు జేఎం మరో ప్రణాళికను ప్రారంభించింది. నిధుల సేకరణ ప్రయత్నాల్లో భాగంగా “తుఫత్ అల్-ముమినాత్” పేరుతో ఓ ఆన్లైన్ కోర్సును ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో మతపరమైన, జిహాద్ సిద్ధాంతాలపై పాఠాలు బోధించనున్నారు. మహిళలను జేఎం బ్రిగేడ్లోకి ఆకర్షించడమే ఈ క్లాసుల ప్రధాన లక్ష్యం.
ఈ తరగతులు నవంబర్ 8న ప్రారంభమవుతాయి. ప్రతి రోజు 40 నిమిషాల సెషన్లు జేఎం చీఫ్ మసూద్ అజహర్ సోదరీమణులు సాదియా అజహర్, సమైరా అజహర్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే ప్రతి మహిళ రూ.500 (పాకిస్థానీ రూపాయలు) విరాళంగా చెల్లించాల్సిందిగా తెలిపారు.
క్లాసుల్లో మసూద్ అజహర్, ఇతర కమాండర్ల కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని, జిహాద్ మరియు ఇస్లాం దృక్కోణంలో మహిళల బాధ్యతలను వివరించనున్నారని సమాచారం. పాకిస్థాన్‌లోని సామాజిక పరిమితులు మహిళలపై ప్రభావం చూపుతున్నందున, వారిని చేరదీసేందుకు ఈ సంస్థ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
