PIB: రూ.500 నోట్ల నిలిపివేత?.. నిజమిదే!

Is RBI discontinuing Rs 500 notes from March 2026? Here’s what government says about it

Is RBI discontinuing Rs 500 notes from March 2026? Here’s what government says about it

PIB: రూ. 500 నోట్లను ప్రభుత్వం రద్దు చేయబోతోందన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ పీఐబీ (PIB) స్పష్టంగా ఖండించింది. ఇలాంటి పుకార్లు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు వాటిని నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను నిజమని భావించి, నిర్ధారణ లేకుండా షేర్ చేసే ధోరణి పెరిగింది. ఇదే నేపథ్యంలో తాజాగా రూ. 500 నోట్లపై కూడా తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. 2026 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 500 నోట్లను ఉపసంహరించుకోబోతోందన్నదే ఆ ప్రచారం సారాంశం. అయితే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని పీఐబీ తేల్చిచెప్పింది.

ఈ అంశంపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం, “రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అసత్యం” అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్లు పూర్తిగా చట్టబద్ధమైనవేనని, వాటిని సాధారణ లావాదేవీల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చని కూడా వెల్లడించింది. నిర్ధారణ లేని వార్తలను నమ్మకుండా, ఇతరులకు పంపకుండా ఉండాలని ప్రజలను కోరింది.

ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రూ. 500 నోట్ల రద్దు గురించి పలుమార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒక పాత యూట్యూబ్ వీడియోను ఆధారంగా చేసుకుని కొందరు కావాలనే ఈ తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక న్యూస్ యాంకర్ 2026 మార్చి నుంచి నోట్లు రద్దవుతాయని పేర్కొన్నట్లు చూపించారు. అయితే అప్పట్లోనే ప్రభుత్వం ఆ వాదనను ఖండించింది.

ఇక నోట్ల రద్దుపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో కూడా స్పష్టత ఇచ్చారు. రూ. 500 నోట్లను నిలిపివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఏటీఎంల ద్వారా రూ. 100, రూ. 200 నోట్లతో పాటు రూ. 500 నోట్లు కూడా యధావిధిగా అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Tollywood: మరోసారి తండ్రి అయిన టాలీవుడ్ హీరో

PIB: రూ.500 నోట్ల నిలిపివేత?.. నిజమిదే!