Internet : హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాల నుంచి కేబుల్స్ తొలగింపు ప్రక్రియను కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వేగవంతం చేశారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ముషారఫ్ ఫరూఖీ, IAS సూచనల మేరకు వారు ఈ ప్రక్రియను ప్రారంభించారు.
ACT Fiber, GTPL/Bharat Fiber, I Net తమకు కేటాయించిన టాస్క్‌లలో దాదాపు 100 శాతం పూర్తి చేశాయి. సీఎండీ కార్యాలయంలో నిన్న జరిగిన సమావేశానికి హాజరైన ఇతర ప్రతినిధులు ప్రధాన రహదారులపై దాదాపు 50 శాతం స్తంభాల నుంచి కేబుల్స్‌ను తొలగించినట్లు ధృవీకరించారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు మరింత సమయం కావాలని కోరారు.
సీఎండీ స్పందిస్తూ.. హైదరాబాద్‌లోని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ఈలోగా తొలగింపు పనులను వేగవంతం చేయాలని ఆయన అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిపై సీఎండీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలంగాణ కేబుల్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో సీఎండీ, కమర్షియల్ డైరెక్టర్ కె.రాములు, అసోసియేషన్ ప్రతినిధులు సతీష్ బాబు, సలాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు, విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఫరూఖీ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని, విద్యుత్ శాఖ ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా తీగలను తొలగిస్తామని హెచ్చరించారు.
“కేబుల్ నిర్వహణ సరిగా లేకపోవడంతో, సాధారణ ప్రజలు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు ఏర్పడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలపై అదనపు భారం పడుతుండడంతో అవి వంగిపోతున్నాయి. అదనంగా, కేబుల్స్ కారణంగా స్తంభాలపై నిర్వహణ పనులు చేయడంలో విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ”అని TGSPDCL పేర్కొంది.