Govt Hospital : భారతదేశంలో, పేద కుటుంబాలకు కూడా మంచి ఆరోగ్య సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం అనేక ప్రభుత్వ ఆసుపత్రులను ప్రారంభించింది. ఈ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రి వైద్యుల నియామకం అనేక పరీక్షలు తర్వాత జరుగుతుంది. ఈ ఆసుపత్రుల్లో అర్హత కలిగిన వైద్యులు మాత్రమే పనిచేస్తారని, రోగులకు అత్యుత్తమ చికిత్స అందుతుందని భావిస్తుంటారు చాలా మంది. కానీ ఇది భారతదేశం. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందడం ఎంత ప్రమాదకరమో తాజాగా హాపూర్‌లో కనిపించింది.
హాపూర్‌లోని బహదూర్‌గఢ్‌లోని నానై గ్రామంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఘర్షణ జరిగింది. ఇందులో సియాకత్ ఖాన్ అనే వ్యక్తి కుమార్తెపై ఓ పార్టీ కర్రతో దాడి చేసింది. దీంతో బాలిక తలకు గాయమైంది. చికిత్స కోసం, కుటుంబ సభ్యులు తమ కుమార్తెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్ బాలిక తలకు కుట్లు వేశారు. అయితే ఆ తర్వాత బాలిక పరిస్థితి విషమించడంతో ఆమెకు తీవ్ర నొప్పి మొదలైంది.
బట్టబయలైన నిర్వాకం..
బాలికకు కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యుడు కుట్లు వేయించి ఇంటికి పంపించాడు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయికి తీవ్రమైన తలనొప్పి మొదలైంది. బాలిక పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలిక కుట్లు తెరిచి చూడగా.. ఆశ్చర్యపోయారు. కుట్లు వేసిన తర్వాత ప్రభుత్వ వైద్యుడు సూదిని తలలోపలే వదిలేశాడని తేల్చారు.
ఇన్వెస్టిగేషన్
ఈ సన్నివేశాన్ని చూసి అందరూ షాకయ్యారు. వెంటనే సూదిని తీసివేసి మళ్లీ కుట్లు వేశారు. ప్రభుత్వ వైద్యుడు మద్యం మత్తులో తమ కూతురి తలకు కుట్లు వేశాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం కూడా చిక్కుల్లో పడింది. ఈ విషయమై హాపూర్ సీఎంఓ విచారణను ఏర్పాటు చేసింది. సూది వదిలేయడం వల్లే తమ కుమార్తెకు తలనొప్పి మొదలైందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.