GST: దీపావళి పండుగ దరి చేరుతున్న వేళ వినియోగదారులు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 3న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో కేవలం రెండు స్లాబ్‌లు – 5% మరియు 18% మాత్రమే కొనసాగుతాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న 12%, 28% స్లాబ్‌లను పూర్తిగా రద్దు చేశారు.
అంతేకాకుండా, వ్యక్తిగత ఆరోగ్యం, ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని సున్నా శాతానికి తగ్గిస్తూ మినహాయింపు ఇచ్చారు. అలాగే అనేక నిత్యవసర వస్తువులపై జీఎస్టీ శాతం తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి:
నిత్యవసర వస్తువులు
తలనూనె, షాంపూ, టూత్‌పేస్ట్, సబ్బులు, షేవింగ్ క్రీమ్‌లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు.
పాల ఉత్పత్తులు
వెన్న, నెయ్యి, మజ్జిగ, ఇతర పాల ఉత్పత్తులు, ప్రీ–ప్యాకేజ్డ్ స్నాక్స్, భుజియా, మిక్చర్, వంట సామగ్రి, పాల సీసాలు, డైపర్లు, కుట్టు మిషన్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు.
ఆరోగ్య సంరక్షణ
వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ రద్దు చేశారు. థర్మామీటర్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, కళ్లజోళ్లు ఇప్పుడు 5% జీఎస్టీకి మాత్రమే లోబడి ఉంటాయి.
వాహనాలు
పెట్రోల్, హైబ్రిడ్ కార్లు (1200 సీసీ లోపు), డీజిల్ కార్లు (1500 సీసీ లోపు), ఎల్పీజీ, సీఎస్ కార్లు, త్రిచక్ర వాహనాలు, 350 సీసీ బైకులు, రవాణా వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు.
విద్య
మ్యాప్స్, చార్టులు, గ్లోబులు, పెన్సిళ్లు, షార్పనర్లు, క్రేయాన్స్, ప్యాస్టెల్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్‌బుక్స్, ఎరేజర్లు – ఇవన్నీ జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు పొందాయి.
వ్యవసాయ రంగం
ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, ట్రాక్టర్లు, బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని కేవలం 5%గా నిర్ణయించారు.
విద్యుత్ గృహోపకరణాలు
ఎసీలు, టీవీలు (32 అంగుళాల పైబడినవి), మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషిన్లపై గతంలో 28% జీఎస్టీ ఉండగా, ఇప్పుడు 18%కి తగ్గించారు.
