Viral: ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్ జిల్లా మదనపుర్ గైబువా గ్రామంలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ‘పైలట్’ అనే శునకం తన యజమానిని కాపాడేందుకు పులితో ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుడు రక్షిత్ పాండే తన పెంపుడు కుక్క పైలట్‌ను వెంటబెట్టుకొని చెరకుతోటకు కోతల పనికోసం వెళ్లాడు. అయితే తోటలో పులి దాక్కుని ఉన్న విషయాన్ని రక్షిత్ గమనించలేదు.
రైతు దగ్గరకు రాగానే పులి ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించింది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్, యజమాని ముందు నిలబడి పులిపై దాడి చేశాడు. పులి మరియు శునకం మధ్య కొద్ది సమయం తీవ్రంగా పోరాటం జరిగింది. ఆ సమయంలో పులి పదే పదే పంజాతో దాడి చేయడంతో పైలట్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
గ్రామస్థుల సహాయం కోసం రక్షిత్ తిరిగి అక్కడికి చేరుకునే సరికి పులి అడవిలోకి వెళ్లిపోయింది. తన ప్రాణాలను కాపాడిన పైలట్‌ను అక్కడే పడిసుండగా చూసిన యజమాని కంటతడి పెట్టాడు. ఈ ఘటన తర్వాత అడవి అధికారులు గ్రామ పరిసరాల్లో పులి కదలికలపై పహారా కోసం పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు డీఎఫ్‌వో ప్రకాశ్ చంద్ర ఆర్య తెలిపారు.
