Delhi Police : రోహిణిలోని తన ఫ్లాట్ గోడపై పాకిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు రాశాడనే ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “రోహిణిలోని అవంతిక సి-బ్లాక్ ప్రాంతంలో ఉంటున్న ఒక వ్యక్తి తన ఫ్లాట్ గోడపై పాకిస్తాన్‌కు మద్దతుగా కొన్ని నినాదాలు రాశాడని స్థానికుల నుండి మాకు సమాచారం వచ్చింది.”
“ప్రాథమిక విచారణలో వ్యక్తి మానసికంగా స్థిరంగా లేడని, ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటాడని సూచించింది”, అన్నారాయన. నిర్బంధంలో ఉన్న వ్యక్తికి పాకిస్థాన్‌తో లేదా ఏదైనా గ్రూప్‌తో సంబంధాలున్నాయనే కోణంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి తెలిపారు. అతని గురించి మరింత తెలుసుకోవడానికి, ఢిల్లీ పోలీసులు అతని కుటుంబ సభ్యులను సంప్రదించారు.
అతని వద్ద ఉన్న అన్ని అభ్యంతరకరమైన పోస్టర్లు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. అతని ఫ్లాట్ గోడపై ఉంచిన పోస్టర్లను కొందరు స్థానికులు చూపుతున్నట్లు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వెలువడ్డాయి.