Wall Collapse : దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో ఈరోజు (సెప్టెంబర్ 13) దర్గా గోడ కూలి ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిలో ఇద్దరిని రక్షించారు. ఢిల్లీలోని బిల్లా దర్గా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ సమాచారం మేరకు మూడు ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
ఈ సంఘటనకు సంబంధించి ఉదయం 7:00 గంటలకు కాల్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారి తెలిపారు. ఇద్దరిని రక్షించామని, అయితే కొంతమంది గోడ శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి.
Delhi: A portion of a building collapsed in Nabi Karim area, two of the three people trapped underneath the debris have been rescued. Rescue operation for the third is underway: Fire Department
— ANI (@ANI) September 13, 2024
సహాయక చర్యల అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో నివాసం ఉంటున్న రెహ్మత్ (35)గా గుర్తించినట్లు అధికారి తెలిపారు. ఈ-రిక్షా నడిపే రెహ్మత్, గోడ కింద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలో నివసించేవాడని తెలిపారు. మరో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని.. శిథిలాలను తొలగిస్తున్నట్లు అధికారి తెలిపారు.