Fake App: ఓ అనధికారిక మొబైల్ యాప్ గురించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అప్రమత్తం చేసింది. తమ అసలైన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను పోలిన విధంగా ఆ యాప్ తయారు చేయబడిందని, ఇది భద్రతాపరంగా తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది.
సిబ్బంది వ్యక్తిగత, సంస్థాగత వివరాలను సేకరించడానికి ఈ యాప్ ప్రయత్నిస్తోందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 3.25 లక్షల మంది సిబ్బందికి జాగ్రత్తలు పాటించాలని సూచనలు ఇచ్చింది. ‘సంభవ్ అప్లికేషన్ రైటర్’ పేరిట ఆ యాప్ వాట్సాప్, యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ప్రచారం అవుతోందని సీఆర్పీఎఫ్ ఐటీ విభాగం జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది.
ఆ యాప్‌ను తాము రూపొందించలేదని, వినియోగానికి కూడా ఎప్పుడూ సిఫార్సు చేయలేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఆ నకిలీ యాప్‌ను ఆన్‌లైన్ ప్లే స్టోర్ల నుంచి తొలగించాలంటూ ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థలను ఇప్పటికే కోరినట్లు వెల్లడించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘సీఆర్పీఎఫ్ సంభవ్’ అనే అసలైన యాప్ ప్రస్తుతం వినియోగంలో ఉంది.
దీనిద్వారా బలగాలు, ఇతర సిబ్బంది వేతనాలు, సెలవులు, బదిలీల అర్హత వంటి వివరాలు తెలుసుకోవచ్చు. కానీ, ‘సంభవ్ అప్లికేషన్ రైటర్’ పేరిట చక్కర్లు కొడుతున్న నకిలీ యాప్ సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వారి వ్యక్తిగత వివరాలను అడుగుతోందని సీఆర్పీఎఫ్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది.
