Delivery: వీడు మామూలోడు కాదు.. వీడియో కాల్ ద్వారా భార్యకు ఇంట్లోనే ప్రసవం చేసిన భర్త

Couple deliver baby at home aided by videos, refuse assistance from health authorities

Couple deliver baby at home aided by videos, refuse assistance from health authorities

Delivery: తమిళనాడులోని దిండిగల్ జిల్లా గోపాల్‌పట్టిలో గురువారం జరిగిన ఒక సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆన్‌లైన్ వీడియోలు, వాట్సాప్‌ గ్రూపుల ప్రభావంతో ఓ జంట వైద్య సిబ్బందితో సహకరించకుండా తమ ఇంట్లోనే ఆడశిశువును ప్రసవించారని ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ సెల్వకుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.
గజేంద్రన్, సత్య అనే ఈ దంపతులు ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని ఇటీవల గోపాల్‌పట్టికి మారారని, గజేంద్రన్ ఇక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. కొద్ది నెలల క్రితం కొసవపట్టి బ్లాక్‌ మెడికల్‌ ఆఫీసర్ బృందం ఇంటింటికీ వెళ్ళి గర్భిణీ సత్యను ఆరోగ్య శాఖలో నమోదు చేసుకోవాలని సూచించింది.కానీ ఆమె, భర్త గజేంద్రన్ సహజ ప్రసవం జరగాలని నమ్ముతూ వైద్య సహాయం తీసుకోవడానికి నిరాకరించారు.
నర్సులు ఇందులో ఉన్న ప్రమాదాలను వివరించినా వారు వినిపించుకోలేదని వైద్య అధికారులు చెప్పారు. గురువారం సాయంత్రం సత్యకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. పొరుగువారు ఈ విషయాన్ని గ్రామ ఆరోగ్య నర్సుకు తెలియజేయగా, ఆమె విభాగానికి సమాచారం అందించింది.వెంటనే అత్యవసర అంబులెన్స్‌ సిబ్బంది, సానర్పట్టి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ గుణశేఖరన్, వీఏఓ సుబ్బురాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కానీ ఆ జంట అధికారులు లోపలికి రానివ్వకుండా తలుపులు మూసుకున్నారు. కొంతసేపటి తర్వాత శిశువు ఏడుపు వినిపించడంతో గజేంద్రన్ బయటకు వచ్చాడు. వెంటనే ఆరోగ్య బృందం లోపలికి వెళ్లి తల్లి, పసికందును పరీక్షించింది. వారు ఆరోగ్యంగా ఉన్నా, వైద్య సిబ్బందికి సహకరించకపోవడంతో కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా, ఈ సంఘటనకు కారణమైనట్లు భావిస్తున్న వాట్సాప్‌ గ్రూపులపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించారు.