Cough Syrup: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారత్‌లో తయారైన మూడు కాఫ్ సిరప్లపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్లు ఆరోగ్యానికి హానికరమని, వీటిని వాడకూడదని స్పష్టంగా సూచించింది. భారతదేశానికి చెందిన మూడు ఔషధ సంస్థల ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
వీటిలో ముఖ్యంగా శ్రేసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన ‘కోల్డిఫ్’ కాఫ్ సిరప్ ఉంది. ఈ సిరప్ వాడటం వల్ల ఇటీవల 22 మంది చిన్నారులు మరణించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగించింది. అలాగే రెన్నెక్స్ ఫార్మా సంస్థ తయారు చేసిన ‘రెస్పిఫ్రెష్ TR’ మరియు షేప్ ఫార్మా కంపెనీ తయారు చేసిన ‘రీలైఫ్’ సిరప్లను కూడా WHO ప్రమాదకర ఉత్పత్తులుగా పేర్కొంది.
WHO వివరాల ప్రకారం, ఈ సిరప్లలో ప్రమాదకర స్థాయిలో విషపదార్థాలు (టాక్సిక్ కెమికల్స్) ఉండే అవకాశం ఉంది. ఇవి పిల్లల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉన్నందున వెంటనే వాడకాన్ని ఆపాలని సూచించింది.
అయితే, భారత కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (Central Drugs Standard Control Organization – CDSCO) స్పందిస్తూ, ఈ సిరప్లు దేశీయ మార్కెట్‌కే పరిమితమని, ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని WHOకు తెలిపింది.
మొత్తానికి, WHO హెచ్చరికతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు దగ్గు మందులు ఇవ్వేముందు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
