Fire Accident: కోల్‌కతాలో ఈరోజు (నవంబర్ 15, 2025) తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలు మొదలయ్యాక కొద్ది నిమిషాల్లోనే అక్కడి నివాస భవనాలు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలకు మంటలు పాకడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. దట్టమైన పొగ కారణంగా పరిసర ప్రాంతం మొత్తం మూలుగిపోయినట్లు కనిపిస్తోంది. పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానికులు ప్రయత్నాలు చేశారు.
17 ఫైర్ ఇంజిన్లతో భారీ ఆపరేషన్
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మొత్తం 17 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు ఎత్తైన భవనాల మీదికి ఎగబాకుతున్నందున, ప్రత్యేకంగా హైడ్రాలిక్ లాడర్లు కూడా వినియోగిస్తున్నారు. భారీ అగ్నికీలతో దట్టమైన పొగ పలు కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడంతో రెస్క్యూ సిబ్బంది భవనాల్లోకి ప్రవేశించడం కష్టమవుతోంది.
పరిస్థితి మరింత క్లిష్టం
మంటల ప్రభావంతో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో పాత భవనాలు, చిన్న వ్యాపార దుకాణాలు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు వేగంగా విస్తరించినట్లు అధికారులు తెలిపారు. గోదాములు, చిన్న వ్యాపారాలపై మంటలు ప్రభావం చూపినట్టు సమాచారం రావడంతో ఆస్తినష్ట పరంగా భారీ నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రమాదానికి కారణం ఏమిటి?
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం వివరాలు వెలువడలేదు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్న తర్వాతే పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
