Crime: బెంగళూరులోని సుద్దగుంటేపాళ్యలో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శిల్పా తన ఇంట్లో మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు నిరంతరం వేధింపులకు గురి చేయడంతో శిల్పా ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
శిల్పా వివాహం జరిగినది ప్రవీణ్‌తో రెండున్నరేళ్ల క్రితం. వారికి ఒకున్నరేళ్ల పాప ఉంది. వివాహానికి ముందు శిల్పా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేది. ప్రవీణ్ కూడా ఆరాకిల్ కంపెనీలో పనిచేశాడు. అయితే పెళ్లి సంవత్సరం తర్వాత ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు.
ఫిర్యాదు ప్రకారం, వివాహ సమయంలో ప్రవీణ్ కుటుంబం రూ.15 లక్షల నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు డిమాండ్‌చేసిందని, వాటిని ఇచ్చినా వేధింపులు ఆగలేదని తెలిపారు. అదనంగా, మరోసారి నగదు, విలువైన వస్తువులు అడుగుతూ నిరంతరం ఒత్తిడి తెచ్చేవారని చెప్పారు. ఆరు నెలల క్రితం ప్రవీణ్ వ్యాపారానికి సహాయం చేయాలంటూ రూ.5 లక్షలు ఇవ్వాలని కూడా ఒత్తిడి తెచ్చినట్లు శిల్పా కుటుంబం ఆరోపించింది.
రంగు కారణంగా వేధింపులు
శిల్పా రంగు కారణంగా కూడా తరచూ అవమానించబడిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. “నువ్వు నల్లగా ఉన్నావు, నా కొడుక్కి సరిపోని పెళ్లి అయ్యావు. మా కొడుక్కి మంచి వధువు వెతుకుతాం, నువ్వు వెళ్లిపో” అంటూ అత్త వేధించేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల విచారణ
ఈ ఘటనపై సుద్దగుంటేపాళ్య పోలీస్‌స్టేషన్‌లో కట్న వేధింపులు, అనుమానాస్పద మరణం కేసు నమోదు చేశారు. ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం అనంతరం శిల్పా మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.
ఇదే తరహా ఘటన
ఇటీవల ఆగస్టు 1న ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే మహిళను భర్త, అత్తమామలు కట్నం వివాదంలో బతికుండగానే తగలబెట్టారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ కేసులో పలు మలుపులు వచ్చాయి. నిందితుల కుటుంబం మాత్రం ఆమె స్వయంగా తనను తాను నిప్పంటించుకుందని, ఘటన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరని వాదిస్తోంది. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
